త్యాజంపూడి
వికీపీడియా నుండి
త్యాజంపూడి అనేది పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ఒక గ్రామం. జిల్లాలోని డెల్టా ప్రాంతానికి, మెట్ట ప్రాంతానికి మధ్యలో ఈ గ్రామం ఉంది. రాష్ట్రంలోని ఇతర గ్రామాల లాగే, ఇక్కడి ప్రజలు కూడా వ్యవసాయంపై ఆధారపడినవారే. వరితో పాటు చెరకు, పత్తి, తృణ ధాన్యాలు, పొద్దు తిరుగుడు సాగు కూడా చేస్తారు.
చుట్టుపక్కల గ్రామాల్లో గాంధీగా ప్రసిద్ధుడైన జంగా వెంకట సుబ్బారెడ్డి ఈ గ్రామస్తుడే. దాతగా పేరొందిన ఈయన గుణ్ణంపల్లి వ్యవసాయ పరపతి సంఘానికి అధ్యక్షుడిగా 18 ఏళ్ళ పాటు పనిచేసాడు. గ్రామంలో ఉన్న పెద్ద చెరువు అనేక రకాల చేపలకు, ఇతర జలచరాలకు నెలవు. ఇక్కడి పురాతన దేవాలయాల్లోని శిల్ప సంపద ద్వారా ఈ గ్రామం చాళుక్యుల కాలం నాటిదని తెలుస్తోంది.
గ్రామ జనాభాలో దాదాపు 20% ముస్లిములు, 20% క్రైస్తవులు కాగా మిగిలిన వారు హిందువులు. రామాలయం వద్దనున్న రచ్చబండ పెద్దలకు సమావేశ స్థలంగాను, పిల్లలకు ఆట స్థలంగాను, ఆధ్యాత్మిక సమావేశాలకు వేదిక గాను ఉపయోగపడుతోంది.